పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన అంగర శంకర్ (32) అనే వ్యక్తి తన భార్య లావణ్య (26)తో సుమారు 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శంకర్ ఇటీవల కాలంలో మద్యం అలవాటుకు బానిసై, పనులు చేయకుండా ఇంటి వద్దే ఉండేవాడని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మార్చి 16 రాత్రి భార్యాభర్తల మధ్య పనుల విషయంలో గొడవ జరిగింది.మరుసటి రోజు ఉదయం శంకర్ తన కొత్త ఇంటి వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లి, అక్కడ గుర్తు తెలియని పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు.విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనే అతడిని పరకాల సంతోష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించమని సూచించారు.దీంతో మార్చి 20న శంకర్‌ను వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్సై డి. సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.