ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్య ధోరణి నశించాలి
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రశ్నల పరంపరగా మారిందని కేవీపీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్ తీవ్ర ఆరోపణలు చేశారు.భూపాలపల్లి జిల్లా ప్రజావాణిలో అర్జీలు సమర్పించినా సమస్యలు పరిష్కారం కాకపోగా,బాధితులను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శిస్తూ.. మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పోస్టర్లు అతికించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆత్కూరి శ్రీధర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు న్యాయం జరుగుతుందనే ఆశతో వస్తున్న బాధితులను చూసి స్పందించాల్సిన జిల్లా అధికారులు, అందుకు భిన్నంగా “పదేపదే ఎందుకు వస్తున్నావ్..?”, “ఎన్నిసార్లు వస్తావ్..?” అంటూ ఎదురు ప్రశ్నించడం అత్యంత బాధాకరమన్నారు.గత ఏడాది డిసెంబర్ నెల నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజావాణిలో తన వ్యక్తిగత సమస్యపై పలుమార్లు దరఖాస్తులు సమర్పించినప్పటికీ,ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ,జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగలేక చెప్పులు అరిగిపోయాయే తప్ప ఫైలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని మండిపడ్డారు.బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన భూపాలపల్లి జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటనలే నిదర్శనమని ఆరోపించారు.ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటుంటే,మరోవైపు క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు బాధితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనలాంటి ప్రజాసంఘాల నాయకుడి సమస్యకే భూపాలపల్లి జిల్లాలో నెలల తరబడి మోక్షం లభించకపోతే, ఇక సామాన్య ప్రజల గతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజావాణి అనేది ప్రజల గొంతుకను వినిపించే నిఖార్సైన వేదిక కావాలే తప్ప,ప్రజలను విసిగించే కార్యాలయంగా మారకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని, జిల్లా ప్రజావాణిలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని,ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్కూరి శ్రీధర్ డిమాండ్ చేశారు.