బొప్పన ఆశయాలు సాధిద్దాం
సత్తుపల్లి మండల పరిధిలోని తాళ్లమడలో జరిగిన సిపిఎం సీనియర్ నాయకులు బొప్పన సత్యనారాయణ 12వ, వర్ధంతి సభ శనివారం అయినంపూడి సనందరావు అధ్యక్షతన జరిగింది. బొప్పన సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ బొప్పన సత్యనారాయణ సత్తుపల్లి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మిక, కర్షక, రైతాంగ సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించే వారన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ విస్తరణకు కృషి చేశారన్నారు. వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు ఈనెల 12న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. యజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లను అందరు వ్యతిరేకించాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా విబిజి రాంజీ పథకం తీసుకొచ్చారని దీనివలన వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పని హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా రాష్ట్రాలపై భారం వేసే విధంగా రాష్ట్రాలు వాటా పది శాతం నుండి 40 శాతం పెంచారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీల అనుకూల కేంద్ర విత్తన చట్టం, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాతో, యూరోపియన్ యూనియన్ లతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాల వలన మన దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పార్టీ మండల సీనియర్ నాయకులు బాల బుచ్చయ్య, వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి, తాళ్లమడ గ్రామ సర్పంచ్ వంశీ, ఓబిళ్ళనేని రామారావు, తడికమళ్ల రామకృష్ణ, బొప్పన శ్రీలక్ష్మి, సాదు పున్నమయ్య, కొలికపోగు జగపతిరావు, దాట్ల రాంబాబు, బెజవాడ రాము, జానపాటి అశోక్, రమాదేవి, గ్రామ రైతులు తిరుమలరావు, మధు, కిషోర్, సత్యనారాయణ, జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.