భూ రీ-సర్వేలో తప్పులకు తావుండొద్దు
గణపురం శివారులో రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
ఆధునిక ‘రోవర్’ సాంకేతికతతో పక్కాగా సరిహద్దుల గుర్తింపు
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రైతులు సహకరించాలని పిలుపు జిల్లాలో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా,అత్యంత పారదర్శకంగా పక్కాగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.బుధవారం గణపురం మండలం,గణపురం శివారు గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.సర్వేయర్లు సర్వే చేస్తున్న తీరును, రికార్డులలో వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ నిశితంగా తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీ సందర్భంగా సర్వే సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ‘రోవర్’ పరికరం ద్వారా భూములను డిజిటల్ పద్ధతిలో సర్వే చేస్తున్న విధానాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూముల సరిహద్దులను పకడ్బందీగా గుర్తించి హద్దులు వేయాలని సూచించారు.ఈ విధానం ద్వారా భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సరిహద్దు వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.భూ రీ-సర్వే ద్వారా రైతులకు తమ భూములపై పూర్తిస్థాయిలో చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతు భూమి వివరాలు ఖచ్చితంగా ఆన్లైన్ రికార్డులలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి రైతులందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. సర్వే జరిగే సమయంలో సంబంధిత రైతులతో పాటు పొరుగున (సరిహద్దులో) ఉన్న రైతులు కూడా క్షేత్రస్థాయిలో పాల్గొని హద్దులను ధ్రువీకరించుకోవాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,గణపురం తహశీల్దార్ రాజేశ్వరరావు, మండల సర్వేయర్ తిరుపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.