
ఈ69న్యూస్ హన్మకొండ మే24
హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం ములకనూర్ గ్రామంలోని మయూరి వైన్స్లో మద్యం విక్రయాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ఫిషర్ బీర్లను బెల్ట్ షాపులకు తరలిస్తూ, సాధారణ కస్టమర్లకు మాత్రం “బీర్లు లేవు” అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైన్స్ వద్దకు వెళ్లిన వినియోగదారులకు ట్యూబోర్గ్, నాక్ ఔట్ వంటి ఇతర బ్రాండ్ల బీర్లను మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, వారు కోరిన బ్రాండ్లు అందుబాటులో లేవని చెబుతున్నట్లు సమాచారం.అలాగే తెలిసిన వ్యక్తులకు మాత్రమే చల్లని బీర్లు అందిస్తూ, సాధారణ ప్రజలకు “చల్లని బీర్లు లేవు.. ఉంటే తీసుకుపో, లేకపోతే లేదు” అంటూ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.బార్ షాపులు, బెల్ట్ షాపులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సాధారణ వినియోగదారులను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి, నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.