హైదరాబాద్ ఘట్కేసర్కు చెందిన తిమ్మయ్య కోసం ముమ్మర గాలింపు..!
హైదరాబాద్ ఘట్కేసర్కు చెందిన తిమ్మయ్య కోసం ముమ్మర గాలింపు..!
వరద ఉద్ధృతికి మరో విషాదం – డ్రైవర్ ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
మేడారం వచ్చే భక్తులు అప్రమత్తం – వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారుల సూచన..!
తెలుగు గళం తాడ్వాయి, మేడారం :
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం జంపన్న వాగులో బుధవారం జరిగిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్లోని ఘట్కేసర్కు చెందిన తిమ్మయ్య అనే కారు డ్రైవర్ వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. జంపన్న వాగులో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో డ్రైవర్ ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వాగు పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా గాలింపు కొనసాగుతోంది. ఘటనపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది. మేడారం వచ్చే భక్తులకు, ప్రయాణికులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా జంపన్న వాగు సహా వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని, వరద నీటిలో వాహనాలను నడపవద్దని హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సూచించే మార్గాలనే వినియోగించాలని, హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని సూచించారు. భక్తులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను తెలుసుకుని మాత్రమే ప్రయాణించాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలకు ప్రమాదం కలిగించే సాహసాలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.