మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కిరాణా షాపుల యజమానులతో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించి,మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ఈ సమావేశానికి చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు వయస్సు గల మైనర్లకు గుట్కా, సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు.యువత ఆరోగ్యం మరియు వారి భవిష్యత్తు దృష్ట్యా ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.నిబంధనలను అతిక్రమించి మైనర్లకు పొగాకు ఉత్పత్తులు లేదా మత్తు పదార్థాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే ప్రతి కిరాణా షాపులో, పరిసర ప్రాంతాలను కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు షాపుల భద్రత మెరుగుపడుతుందని తెలిపారు.మండలంలో శాంతిభద్రతలు కాపాడేందుకు, యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రజా ఆరోగ్యం పరిరక్షణలో భాగంగా అందరూ బాధ్యతతో వ్యవహరించాలని ఎస్సై సూచించారు.