రేగొండ మండల కేంద్రంలో తీరని బస్టాండ్ ఇబ్బందులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ మండల కేంద్రమైన రేగొండలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న రవాణా వసతుల నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మండల కేంద్రంలో కనీస అవసరమైన బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం వందలాది మంది వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రేగొండకు వస్తుంటారని, అయితే ఇక్కడ ప్రయాణికుల షెడ్డు లేదా బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎండకాలంలో తీవ్రమైన ఎండకు ఎండుతూ, ప్రస్తుత వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తడుస్తూ, చిన్న పిల్లలతో ప్రయాణించే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక రాజకీయ నాయకులు కు కనీసం కంటిమీద కునుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ముఖ్యంగా రేగొండ గుండా వెళ్లే ప్రధాన జాతీయ రహదారి (హైవే) పై నిరంతరం ఇసుక లారీలతో పాటు భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని నాగుల అరవింద్ గుర్తుచేశారు. రోడ్డు పక్కన కనీస రక్షణ గోడ లేదా వేచి ఉండే స్థలం లేకపోవడంతో, ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బస్సుల కోసం రోడ్డుపైనే నిలబడాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ వాహనాల వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవించి అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోయే ప్రమాదం ఉందని అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవి బాధ్యతలు చేపట్టి రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచినప్పటికీ,నియోజకవర్గంలోనే అత్యంత కీలకమైన రేగొండ మండల కేంద్రంలో ఒక బస్టాండ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించలేకపోవడం,ప్రజా సమస్యల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి సజీవ నిదర్శనమని మండిపడ్డారు.ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పెద్ద పెద్ద హామీలు గుప్పించిన నాయకులు, గెలిచిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను సైతం విస్మరించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని విమర్శించారు.ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే,రవాణా శాఖ అధికారులు ఉదాసీనతను వీడి, తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో నిలిచిపోయిన బస్టాండ్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి, ఆధునిక వసతులతో కూడిన బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే రేగొండ పెద్ద బస్టాండ్ అనగా సినిమా టాకీస్ దగ్గర ఉన్న బస్ స్టాప్ వద్ద ఆర్ టి సి డ్రైవర్స్ బస్సులు ఆపడం లేదని ప్రయాణికులు తమ దృష్టికి తీసుకువచ్చినట్టు వారు తెలిపారు.తక్షణమే ఆర్టీసీ అధికారులు సినిమా టాకీస్ బస్టాప్ వద్ద బస్సులు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రేగొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను, విద్యార్థి సంఘాలను,నిత్య ప్రయాణికులను పెద్ద ఎత్తున సమీకరించి, జాతీయ రహదారి దిగ్బంధనంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి వంటి ఉధృతమైన ఆందోళనలు,ప్రజా ఉద్యమాలు చేపడతామని నాగుల అరవింద్ హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్‌తో పాటు రేగొండ మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, నిత్య ప్రయాణికులు,స్థానిక వ్యాపారులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.