
ఈ69న్యూస్ వరంగల్: ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ అయిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజిఎం) లో సిబిపి (CBP – కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు కొంతకాలంగా అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతిరోజూ వందలాది మంది పేద, మధ్యతరగతి రోగులు ఈ ఆస్పత్రిని ఆశ్రయిస్తుంటారు.అయితే ముఖ్యమైన రక్త పరీక్షలలో ఒకటైన సిబిపి పరీక్షలు నిలిచిపోవడంతో వైద్యులు రోగులను ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది.పేద ప్రజలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర చికిత్సల కోసం వచ్చిన రోగులు పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి రావడం వల్ల చికిత్సలో ఆలస్యం జరుగుతోంది.కొంతమంది రోగులు మాట్లాడుతూ, “ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి కూడా బయట డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. వెంటనే సిబిపి సేవలు పునరుద్ధరించాలి” అని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి, ఎంజిఎం ఆస్పత్రిలో సిబిపి పరీక్షలను తిరిగి ప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.