వార్డు ప్రజల ఆశీర్వాదమే నా బలం
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) తన వార్డులో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రజల మద్దతు కోరుతున్నారు.
ప్రజలే దేవుళ్లు.. సేవకుడిగా పనిచేస్తా:
ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ, వార్డు ప్రజలను తన దైవంగా భావిస్తానని, వారి కష్టసుఖాల్లో తోడుండే ఒక సేవకుడిగా పని చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.గతంలో వార్డులో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.“వార్డు ప్రజలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపిస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల చెంతనే ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక నిధులతో ఆదర్శ వార్డు లక్ష్యం:
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్యల సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి 13వ వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే తనకు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి మార్గదర్శకత్వంలో ప్రజా సేవ చేయడం తన అదృష్టమని అన్నారు.
సంక్షేమం–అభివృద్ధే లక్ష్యం:
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే పథకాలు, మహిళల సాధికారతకు ప్రత్యేక కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో కాంగ్రెస్ కట్టుబడి పని చేస్తోందని చెప్పారు.ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అదే స్ఫూర్తితో 13వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధికి బాటలు వేస్తాం:
మున్సిపాలిటీ అభివృద్ధిలో 13వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, వార్డులోని ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిజమైన సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని గుర్తు చేస్తూ.. రాబోయే ఎన్నికల్లో ‘చేతి గుర్తు’ పై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు