సర్కారు బడికి సరికొత్త శోభ.. స్వయంగా రంగులు వేసిన సర్పంచ్
సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఆకర్షణీయమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఆదర్శప్రాయంగా ముందుకు వచ్చారు.గ్రామంలోని ముప్పారం ప్రాథమిక పాఠశాలను స్వయంగా శుభ్రపరచి,రంగులు వేయడంలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు.పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచ్ రేణుక, శనివారం పాఠశాలలోని 10 గదులకు కొత్తగా రంగులు వేయించారు.విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాల భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు స్వయంగా రంగులు వేస్తూ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శితో కలిసి సేవలందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక మాట్లాడుతూ, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు గులాబీ పుష్పాలు అందించి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు.విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.సర్కారు పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్,వార్డు సభ్యులు శ్వేత సాగర్,శోభా మల్లయ్య,గ్రామ కార్యదర్శి ఆకారం సురేష్,పీఏసీఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు