సింగరేణి అవినీతి పై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తింది
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి
అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
సింగరేణి పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాటం : గండ్ర దంపతులు
సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో చోటుచేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులతో కలిసి సింగరేణి పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కుతోందని తెలిపారు. కార్మికుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా సింగరేణి సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అత్యంత ఆందోళనకరమని అన్నారు.సింగరేణిలో కొత్త నిబంధనల పేరుతో ప్రవేశపెట్టిన “సైట్ విజిట్” వ్యవస్థను అవినీతికి మార్గం చేసేలా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో నిబంధనలను పక్కనపెట్టి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయల ప్రజాధనం కొందరి జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు.ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సింగరేణి అవినీతిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.నిజంగా ఈ అవినీతి వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలని వారు సవాల్ విసిరారు. అలా చేయకుండా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్–బీజేపీ పార్టీల మధ్య ఉన్న అవినీతి బంధాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, సంస్థ భవిష్యత్తు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు.ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సింగరేణి కార్మికులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.