ఆటో యూనియన్ నూతన కమిటీ సభ్యులు పోలీసు అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన వేళ
ఏటూరునాగారం ఆటో యూనియన్ నూతన కమిటీ అధ్యక్షుడు ఇర్సవడ్ల కిరణ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గురువారం ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సీఐ సూర్యప్రకాశ్, ఎస్ఐ మహేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు శాలువాలు కప్పి సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆటో యూనియన్ నూతన కమిటీ సభ్యులను పోలీసు అధికారులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా సీఐ సూర్యప్రకాశ్, ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం కాకూడదని సూచించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇర్సవడ్ల కిరణ్, నాయకులు ముదురుకోళ్ల సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు