చిట్యాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
భూపాలపల్లి జిల్లాలో పోలీసు సేవలను మరింత వేగవంతం,సమర్థవంతం చేయడమే లక్ష్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గురువారం చిట్యాల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా స్టేషన్లోని ప్రధాన రికార్డులు, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరుతో పాటు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులు, ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన, నమ్మకమైన పోలీసు సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.