ఎంజీఎన్ఆర్ఈజీఏ పునరుద్ధరణకు దేశవ్యాప్త పోరాటం
ఒంగోలు,యూపీఏ ప్రభుత్వ హయాంలో కోట్లాది వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రామ్‌జీ తెచ్చి కేంద్ర ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ధ్వజమెత్తారు. వెంటనే వీబీజీ రామ్‌జీని రద్దుచేసి ఎంజీఎన్ఆర్ఈజీఏను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఒంగోలులో మూడు రోజులపాటు జరుగుతున్న భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ సమితి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు పెరిన్ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో వెంకట్రాములు మాట్లాడుతూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలని, సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించి రోజుకు రూ.700 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, భూమి సమస్య, సాంఘిక సమానత్వం తదితర సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలపై, మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలన్నారు.
తెలంగాణలో వాగ్దానాలు గాలికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు చేసిన వాగ్దానాలు రెండున్నర సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదని వెంకట్రాములు విమర్శించారు. ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి సంవత్సరానికి రూ.12,000, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, సామాజిక పెన్షన్లు నెలకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్, చేతి వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న వాగ్దానాలు తుంగలో తొక్కబడ్డాయన్నారు.ఈ పరిస్థితుల్లో ఎన్నికల వాగ్దానాల అమలు కోసం, అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు నిర్వహిస్తోందని, వాటన్నింటినీ సాధించే వరకు అంకితభావంతో పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ నాయకులు వి.ఎస్.నిర్మల్, జానకి పాశ్వాన్, ఆవుల శేఖర్, తెలంగాణ నుండి జాతీయ సమితి సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, అక్కపెల్లి బాపు, తోటపల్లి శంకర్, సిలువేరు విజయ తదితరులు పాల్గొన్నారు.