ఎమ్మారై యంత్రం ఏర్పాటులో జాప్యం
భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనుల్లో జరుగుతున్న జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన ఆయన, ఎమ్మారై పరికరం ఏర్పాటు, డయాలసిస్ కేంద్రం పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరా సదుపాయాల కల్పనలో ఆలస్యం జరుగుతున్నదని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి సంబంధిత అధికారులపై తీవ్రంగా స్పందించారు.అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడాన్ని గంభీరంగా తీసుకున్న కలెక్టర్,వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను సమర్థవంతంగా పూర్తి చేయేందుకు ఆర్డీవోను పర్యవేక్షణాధికారిగా నియమించినట్లు తెలిపారు.విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలు ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తికావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో అధికారులను నిలదీశారు.ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవల కోసం ఈ యంత్రం ఎంతో అవసరమని పేర్కొంటూ, ఈ నెలాఖరులోపు అన్ని పనులను పూర్తి చేసి ఎమ్మారై యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా. వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు