మంత్రి సీతక్కకు ఆదివాసి సంఘాల వినతి
మంత్రి సీతక్కకు ఆదివాసి సంఘాల వినతి
జిఓ ఎంఎస్ నెం.49 అమలు చేయకుండా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయం – ఆదివాసి సంఘాల ఆవేదన!
షెడ్యూల్డ్ ఏరియా యువత హక్కులను కాపాడాలి.. వెంటనే నోటిఫికేషన్ సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి!
తెలుగు గళం ములుగు:
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసుల ఉద్యోగ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఆదివాసి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగి సంఘాల ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కని కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే, జిఓ ఎంఎస్ నెం.49 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియా పోలీస్ స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులలో 75 శాతం ఉద్యోగాలను స్థానిక ఆదివాసులకే కేటాయించాల్సిన నిబంధన అమల్లో ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన 2026 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఆ నిబంధనను స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంత యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో అమలైన విధానాన్నే కొనసాగిస్తూ ఆదిలాబాద్, కొమురం భీమ్–ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర షెడ్యూల్డ్ ఏరియా పోలీస్ స్టేషన్లలో స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్ను స్పష్టంగా నోటిఫికేషన్లో పొందుపరచి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిబంధన అమలైతే మాత్రమే రాజ్యాంగం కల్పించిన రక్షణ, షెడ్యూల్డ్ ఏరియా చట్టాల ఉద్దేశ్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, ఆదివాసి యువతకు న్యాయం జరిగేలా సంబంధిత నోటిఫికేషన్లో వెంటనే సవరణలు చేయాలని మంత్రి సీతక్కని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని ఏజెన్సీ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు బట్టా వెంకటేశ్వర్లు, ఆదివాసి ఉద్యోగి చిడే ఓ.కిషోర్, ఆదివాసి నిరుద్యోగులు తోలెం కళ్యాణ్, కొమరం మనోజ్ కుమార్, కబ్బాక ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.