కాకర్లపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాలలో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే అనంతరం ప్రజాసంఘాల నాయకులు జాజిరి శ్రీనివాస్, జాజిరి జ్యోతి, కువారపు లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠశాలలో కంప్యూటర్ బోధకుడు, శాశ్వత ఆంగ్ల ఉపాధ్యాయుడిని తక్షణమే నియమించాలని కోరారు.
పాఠశాల ప్రారంభమై నెలరోజులు గడిచినా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 11 కంప్యూటర్లు ఉన్నప్పటికీ కంప్యూటర్ బోధకుడు లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఉన్న తరగతి గదులు సరిపోవడం లేదని, అదనంగా మూడు తరగతి గదులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే గ్రంథాలయం ఉన్నప్పటికీ ప్రత్యేక గ్రంథాలయ గది లేకపోవడం విచారకరమని, వెంటనే లైబ్రరీ గదిని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆడ విద్యార్థినులకు ప్రతి నెల శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, మినీ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల సమయంలో పాఠశాల ఆవరణలో నీరు నిలిచి బురదగా మారుతున్నందున మొరం పోసి మైదానాన్ని చదును చేసి విద్యార్థులు ఆటపాటలకు అనువుగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం నాయకులు బండి వేలాద్రి, దాట్ల రాంబాబు, కొప్పుల చిన్నస్వామి, ఆంగోతి చిట్టెమ్మ, శైలజ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు