ఘనంగా 'అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం'
అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ,వరంగల్ పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక (యూఎఫ్ఈపి),జన విజ్ఞాన వేదిక, భూపాలపల్లి ఎకో క్లబ్,హరిత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రాచీన చారిత్రక ప్రాంతమైన పాండవుల గుట్ట వద్ద ట్రెక్ వాక్, ‘టైగర్ టాక్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అటవీ అధికారి (డి ఎఫ్ ఓ) జి.కిష్టాగౌడ్ మాట్లాడుతూ… ఒకప్పుడు పెద్ద పులులకు నిలయంగా ఉన్న భూపాలపల్లి అడవుల్లో, వాటికి ఆహారంగా ఉండే శాఖాహార జంతువులను విచ్చలవిడిగా వేటాడటం వల్లనే క్రమంగా పులులు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.పులుల సంరక్షణ కేవలం చట్టాలు, కఠిన శిక్షలతోనే కాకుండా ప్రజల భాగస్వామ్యం, విస్తృత అవగాహనతోనే సాధ్యమవుతుందన్నారు.భూపాలపల్లి అడవులు ఎంతో ప్రఖ్యాతి గాంచినవని, ఇక్కడ అటవీ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలను చైతన్యపరుస్తూ అటవీ సంరక్షణ చేపడతామని తెలిపారు.అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని ‘టైగర్ కారిడార్’గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారులు కాజీపేట పురుషోత్తం,జి.సారయ్య, అటవీ డివిజన్ అధికారులు సందీప్ రెడ్డి, అప్పలకొండయ్య, అటవీ క్షేత్ర అధికారులు, సిబ్బందితో పాటు యూఎఫ్ఈపి ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్ కుమార్,జన విజ్ఞాన వేదిక భూపాలపల్లి ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు, ఎకో క్లబ్ ప్రతినిధులు సాజిద్ అలీ, రహీం తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రహీం పాముల ప్రదర్శన, వెంకటేశ్వర్లు పర్యావరణ గీతం, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ అందరినీ ఆకట్టుకున్నాయి.స్థానిక చెల్పూర్ రేంజర్ చంద్రమౌళి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.