దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల ధర్నాకు సంఘీభావంగా హనుమకొండ జిల్లాలో సింగరేణి విశ్రాంతి పెన్షనర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సంఘం అధ్యక్షుడు కడార్ల ప్రకాష్ చారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, డి.ఏ.తో కూడిన కనీస పెన్షన్‌ను రూ.15,000గా నిర్ధారించాలని డిమాండ్ చేశారు. గత 28 సంవత్సరాలుగా పెన్షన్ సవరణ జరగకపోవడం వల్ల విశ్రాంతి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే పెన్షన్ సవరణ చేపట్టడంతో పాటు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివిజన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సత్యనారాయణ మాట్లాడుతూ, పెన్షన్ విధానాన్ని వేజ్ బోర్డులో భాగం చేయాలని, సీపీఆర్ఎంఎస్ వైద్య సేవలను అపరిమితంగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.విశ్రాంతి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.ఇక నాలుబాల దామోదర్ మాట్లాడుతూ, తక్కువ పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న విశ్రాంతి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి జీవనోపాధి మెరుగుపర్చే చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో నాగపురి రమేష్ బాబు, ఎం. రమేష్ కుమార్, అద్దంకి సారంగ చారి, ఎస్. ప్రభాకర్, రామోజు రామ్మూర్తి, కొలనుపాక సాంబయ్య, మాధవరావు, ఎస్.ఎస్. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మొత్తం సుమారు 60 మంది విశ్రాంతి కార్మికులు సమావేశంలో పాల్గొని ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.విశ్రాంతి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు