
ధర్మసాగర్ (ఈ69 న్యూస్) మార్చి 23:హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి పశువుల దవాఖానలో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం (NADCP)లో భాగంగా గాలికుంట (FMD) వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక, మాజీ ఉపసర్పంచ్ కుమారస్వామి, స్థానిక నాయకులు వల్లేపు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట రేణుక మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థిక స్థితికి కీలకమని, గాలికుంట వంటి వ్యాధులను ముందుగానే నివారించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రతి పశుపోషకుడు వినియోగించుకోవాలని సూచించారు.పశువైద్యుడు డా. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, టీకాలు వేయడం ద్వారా పశువులలో వ్యాధులను నివారించి, పాలు మరియు ఇతర ఉత్పత్తుల దిగుబడిని పెంచుకోవచ్చని, దీంతో రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.అధికారుల వివరాల ప్రకారం, గోవులు, ఎద్దులు, గొర్రెలకు ఉచితంగా గాలికుంట టీకాలు అందించడమే కాకుండా, ప్రతి పశువుకు ఇయర్ ట్యాగింగ్ కూడా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని అన్ని పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు, లింగారెడ్డి, చంద్రయ్య, వల్లేపురెడ్డి రవీందర్ రెడ్డి, కొలిపాక రాజు, మల్లయ్య, కరుణాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యం పరిరక్షణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.