పోలీసులు మరోసారి విజయాన్ని సాధించారు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి చిట్యాల
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేయడంలో చిట్యాల పోలీసులు మరోసారి విజయాన్ని సాధించారు.గురువారం చిట్యాల పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రావణ్ కుమార్ పోగొట్టుకున్న నాలుగు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అందజేశారు.వివిధ గ్రామాలకు చెందిన నలుగురు బాధితులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఫోన్లను ట్రాక్ చేశారు. ఈ ప్రక్రియలో కానిస్టేబుల్ లాల్ సింగ్ కీలక పాత్ర పోషించగా,ఫోన్ల ఐఎంఈఐ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి విజయవంతంగా రికవరీ చేయగలిగారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నవాబుపేటకు చెందిన సర్వ శరత్ కుమార్ ఆగస్టు 2024లో పోగొట్టుకున్న వివో టీ5 ప్రో మొబైల్ ఫోన్, అదే గ్రామానికి చెందిన అనుప మహేష్‌కు చెందిన రెడ్మి నోట్ 12 ప్రో మొబైల్,నవాబుపేటకు చెందిన దువ్వల ప్రవీణ్‌కు చెందిన ఒప్పో మొబైల్ ఫోన్,శాంతినగర్‌కు చెందిన మేకల గణేష్‌కు చెందిన ఒప్పో మొబైల్ ఫోన్‌ను పోలీసులు బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు అధైర్యపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా సిఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.ఇతరుల మొబైల్ ఫోన్లు దొరికినట్లయితే వెంటనే పోలీసులకు అప్పగించాలని, అక్రమంగా వినియోగించడం నేరమని హెచ్చరించారు.తమ విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ,ఎస్సై శ్రావణ్ కుమార్‌కు,ఈ కేసులో కీలకంగా పనిచేసిన కానిస్టేబుల్ లాల్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.