
ఈ69 న్యూస్ హైదరాబాద్ మార్చి 30
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ‘పారాక్వాట్’ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రవేశపెట్టిన తీర్మానంపై మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు.అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ గడ్డి మందును నిషేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. రైతులు పొలాల్లో కలుపు మొక్కల నివారణ కోసం విస్తృతంగా ఈ మందును ఉపయోగిస్తున్నప్పటికీ, అదే మందు ఆత్మహత్యలకు కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.పారాక్వాట్ తాగిన వారిలో సుమారు 98 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ఎలాంటి విరుగుడు మందు లేకపోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.ఆసుపత్రులకు తీసుకెళ్లినా వైద్యులు కూడా రోగులను కాపాడలేని పరిస్థితి నెలకొంటోందన్నారు.ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ కూడా ఈ గడ్డి మందును వెంటనే నిషేధించాలని నిర్ణయించిందని తెలిపారు.అలాగే వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కూడా లోక్సభలో ఇదే అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థలు కూడా పారాక్వాట్ ప్రమాదకరమని హెచ్చరించాయని తెలిపారు. స్విట్జర్లాండ్లో తయారయ్యే ఈ మందును ఆ దేశంలోనే వాడకపోవడం గమనార్హమని, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు ఇప్పటికే దీనిని నిషేధించాయని చెప్పారు.తెలంగాణలోనే ప్రతి సంవత్సరం 2 వేల మందికి పైగా ఈ గడ్డి మందు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 60 నుండి 90 రోజుల వరకు తాత్కాలిక నిషేధం విధించే అధికారం ఉన్నందున, వెంటనే రాష్ట్రంలో నిషేధం అమలు చేసి దేశవ్యాప్తంగా పూర్తి నిషేధానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.ఈ విషయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.