పారామెడికల్ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి
పారామెడికల్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ నర్సింగ్ అధికారి పోస్టులు 2322కు సంబంధించిన ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరగా, ఏప్రిల్ 9న జాబితా విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఏఎన్ఎం పోస్టులు 1931కు సంబంధించి ఉన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం కాంట్రాక్టు విధానంలో పనిచేసిన వారికి 20 మార్కుల సేవా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయ సలహా ఆలస్యం అవుతున్నందున వెంటనే పూర్తి చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో న్యాయ సలహా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 732 భర్తీపై తాత్కాలిక జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నందున న్యాయ సలహా ప్రభుత్వానికి అందిందని, దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక నెలలుగా పోరాటం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో: పుష్పలత, పద్మ, స్వప్న, సునందతో పాటు ఏఎన్ఎం, ఫార్మసిస్ట్, నర్సింగ్ అధికారి విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు