ప్రకృతి విపత్తులపై ముందస్తు అవగాహన
గణపురం మండలంలోని గణపురం రిజర్వాయర్ వద్ద ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో వరదలు, నీటిమునక ప్రమాదాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం విస్తృత అవగాహన డెమో కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథులుగా హాజరై పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వరదల సమయంలో తక్షణం తీసుకోవాల్సిన రక్షణ చర్యలు,ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి, నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని ఎలా కాపాడాలి వంటి అంశాలను సమగ్రంగా వివరించింది.లైఫ్ జాకెట్లు, రోపులు వంటి రక్షణ పరికరాల వినియోగ విధానాన్ని ప్రదర్శిస్తూ, ప్రమాద పరిస్థితుల్లో భయపడకుండా చాకచక్యంగా స్పందించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు.అదేవిధంగా నీటి ప్రవాహంలో చిక్కుకున్నప్పుడు ఎలా స్థిరంగా ఉండాలి, సహాయక బృందాలకు ఎలా సంకేతాలు ఇవ్వాలి వంటి ప్రాథమిక సూచనలు కూడా అందించారు.ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ప్రకృతి విపత్తులు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా అంచనా వేయడం కష్టం అయినప్పటికీ, ముందస్తు అవగాహనతో ప్రాణ నష్టం తగ్గించవచ్చని అన్నారు. ప్రజలు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అవగాహన కలిగి ఉంటే తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించగలరని తెలిపారు. గ్రామ స్థాయిలో మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించవచ్చని సూచించారు.వరదల సమయంలో రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో స్విమ్మింగ్ క్లబ్బులను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ అందించే ప్రణాళికను అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గతంలో మోరంచపల్లి వాగు ప్రవాహం కారణంగా ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ డెమో కార్యక్రమం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారని ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజల అప్రమత్తత కూడా అత్యంత కీలకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహించడం ద్వారా ప్రజలు ప్రమాద పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునే సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు.ప్రభుత్వం చేపడుతున్న రక్షణ చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించి, తమ భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ దామోదర సింగ్,తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్,సర్పంచ్ రాధిక, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రకృతి విపత్తులపై అవగాహన పెంపొందించడంలో మంచి ఫలితాలు సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.