ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
70 దరఖాస్తులు స్వీకరణ–సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్
వచ్చే సోమవారానికి పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆదేశం
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.మొత్తం 70 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు.వీటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వస్తున్నందున వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాధాన్యతతో స్పందించాలని సూచించారు.ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని,పరిష్కార ప్రక్రియను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు.ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.దరఖాస్తుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లోపం ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.