ప్రజా సంక్షేమ బడ్జెట్ దేశానికే ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రేగొండ–గోరికోతపల్లి మండల అధ్యక్షుడు కోయిల క్రాంతి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల భారీ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.ఈ బడ్జెట్లో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూ.26,674 కోట్లను కేటాయించడం అభినందనీయమని అన్నారు.“అమ్మ కల – బిడ్డ చదువు – తెలంగాణ భవిష్యత్తు” అనే నినాదంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం అందించడం, వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ ఇవ్వడం, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమని కొనియాడారు.అదేవిధంగా ఐటీఐ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్ అందించడం యువతకు ప్రోత్సాహకరమని తెలిపారు.ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.1000 కోట్ల కేటాయింపు చేయడం ద్వారా దానిని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ప్రయత్నం శ్లాఘనీయమని పేర్కొన్నారు.యువత అభివృద్ధి కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రూ.6000 కోట్ల కేటాయింపు స్వయం ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి CURE, PURE, RARE వంటి వ్యూహాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత పాలనను అమలు చేస్తోందని, విద్యా రంగంలో మరిన్ని సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.