బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా డుంగ్రోత్ కిషోర్ నాయక్
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (ఎఐబిఎస్ఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా డుంగ్రోత్ కిషోర్ నాయక్ నియమితులయ్యారు.హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఈ నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు.రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బంజారా సమాజ ప్రముఖులు మరియు జాతీయ స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బంజారా భీష్మగా పేరుపొందిన మాన్య అమర్ సింగ్ తిలావత్ (మాజీ మంత్రి), జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజ్మీర ప్రొఫెసర్ సీతారాం నాయక్, జాతీయ సలహా కమిటీ చైర్మన్ రఘు నాయక్ రుదావత్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, మాజీ చైర్మన్ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జాతీయ, రాష్ట్ర స్థాయి ఎఐబిఎస్ఎస్ నాయకులు,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు,ఓయూ విద్యార్థి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డుంగ్రోత్ కిషోర్ నాయక్ మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానని, బంజారా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, రాజకీయ మరియు ఆర్థిక రంగాల్లో బంజారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.ఈ నియామకం ద్వారా బంజారా సమాజ సమస్యల పరిష్కారానికి మరింత బలమైన వేదిక ఏర్పడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.