మత సామరస్యానికి అద్భుత నిదర్శనం
ముస్లింలతో కలిసి నమాజ్‌లో పాల్గొన్న సర్పంచ్, వార్డు సభ్యుడు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మత సామరస్యాన్ని ప్రతిబింబించే హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది.గ్రామంలోని మసీదులో నిర్వహించిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మయ్య, వార్డు సభ్యుడు సోరయ్య పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.ముస్లింలు నెల రోజుల పాటు ఆచరించిన కఠోర ఉపవాసాల అనంతరం జరిగిన ఈ ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో ఇతర మతాల ప్రజలు కూడా భాగస్వామ్యం కావడం గ్రామంలో ఐక్యతను మరింత బలపరిచింది.నమాజ్ అనంతరం అందరూ కలిసి సెమియా (శీర్ ఖుర్మా) పంచుకుని తినడం ద్వారా పరస్పర స్నేహభావాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మయ్య మాట్లాడుతూ, అన్ని మతాలు శాంతి, ప్రేమ, సహనాన్ని బోధిస్తాయని, గ్రామంలో ఇలాంటి సామరస్య వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. వార్డు సభ్యుడు సోరయ్య కూడా మాట్లాడుతూ, మత భేదాలు పక్కనపెట్టి అందరూ కలిసిమెలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.కార్యక్రమానికి సదర్ సాబ్ అబ్బాస్ అలీ, మౌల్వీ సాబ్ ఎం.డి. మహబూబ్ పాషా ధార్మిక సందేశాలు అందించారు. వారు రంజాన్ పర్వదినం ఆత్మను వివరిస్తూ ఉపవాసం ద్వారా మనసు పవిత్రమవుతుందని, పేదల పట్ల కరుణ, సహాయం చేయాలనే భావన పెంపొందుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మీరా సాబ్, షఫీర్, అక్మల్ తదితరులు పాల్గొని ఏర్పాట్లలో సహకరించారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సంఘటన చిల్పకుంట్ల గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.