మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
మహిళల ఆర్థికాభివృద్ధి,స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు.శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని గిరిజన సంక్షేమ భవన్లో నిర్వహించిన కుట్టు మిషన్ల శిక్షణా కార్యక్రమం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు ఉద్యాన యాంత్రీకరణ పరికరాలను అందజేశారు.మహిళలు శిక్షణ పొందడమే కాకుండా ఉత్పత్తి రంగంలో కూడా ముందుకు వచ్చి నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలని మంత్రి సూచించారు.శిక్షణతో పాటు నైపుణ్యం పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని అన్నారు. త్వరలోనే కాటారం, మంథని ప్రాంతాల్లో గార్మెంట్స్కు సంబంధించిన చిన్న ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే మహాదేవపూర్ ప్రాంతంలో అగరుబత్తుల తయారీకి సంబంధించిన పెద్ద కంపెనీ ద్వారా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.శిక్షణ పొందిన మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసినప్పుడే వాటికి మంచి మార్కెట్ లభిస్తుందని, తద్వారా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాజీవ్ యువశక్తి కార్యక్రమం ద్వారా డైరీ ఉత్పత్తులపై కూడా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఒక సమగ్ర వ్యవస్థ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి భవిష్యత్తులో కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.మహిళా శక్తి క్యాంటీన్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు త్వరలోనే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే వదినపల్లి,నాచారం ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు సన్న వడ్లకు బోనస్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.మహిళా సాధికారత కోసం అలిమ్ సమస్త సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి అభినందించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణతో పాటు వివిధ సంస్థలను పరిచయం చేయాలని సూచించారు. వయాట్రీస్, అలిమ్ సంస్థల సహకారంతో మూడు మండలాల్లో మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.కుట్టిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అలిమ్ సంస్థ ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా ఎస్పీ సంకీర్త్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, సర్పంచ్ హసీనా భాను తదితరులు పాల్గొన్నారు.