యూరియా యాప్ రద్దు చేసి పాత విధానంలోనే ఎరువుల పంపిణీ చేయాలి
రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ సీజన్లో రైతులకు అత్యంత అవసరమైన సమయంలో యాప్ ఆధారిత పంపిణీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నెట్వర్క్ సమస్యలు, సర్వర్ లోపాలు, సాంకేతిక అంతరాయాలతో రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ పనిచేయకపోవడంతో రైతులు పలుమార్లు దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా అందని పరిస్థితి నెలకొందన్నారు.
సకాలంలో యూరియా అందక పంటల ఎదుగుదల దెబ్బతింటోందని, వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో అమలులో ఉన్న విధానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎరువులు అందేవని, ఇప్పుడు అనవసరంగా సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని యాప్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకుని, పాత విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమైతే రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, పంపిణీ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
సమావేశంలో పాల్గొన్నవారు: రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్, టీడీపీ నాయకులు రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ నాయకులు మోరంపూడి పాండురంగారావు, సీపీఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం నాయకులు బాల బుచ్చయ్య, మోరంపూడి వెంకట్రావు, కేశవరెడ్డి, రమణ, అరవపల్లి గోపాలరావు, వెంకటేశ్వరరావు, కొత్త సత్యనారాయణ, కుమారస్వామి, వేలాద్రి, కంచర్ల వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు తడికముల దాస్, చావ రమేష్, మహిళా సంఘం నాయకులు జాజిరి జ్యోతి, చెరుకు రత్నకుమారి, పుష్పవల్లి, రజిని, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.