వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
స్థానిక ఎన్పిడిసీఎల్ సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో 99 రోజుల ప్రజాపాలన కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మరియు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ ఇంజనీర్ సాధన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఆకస్మిక అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు.ప్రతి కర్మాగారం, కార్యాలయం మరియు ప్రజా స్థలాల్లో భద్రతా చర్యల్లో భాగంగా అగ్నిమాపక పరికరాలు, ఎయిర్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.అగ్ని ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ 101 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, లోపాలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది, లైన్మెన్ బైరోజు రమేష్, ఆర్టిజన్ గ్రేడ్-1 అల్లావుల రాము, రాజయ్య, అరుణ, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై సిబ్బందికి ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు.