- 2014–2021 బోనస్ బకాయిలపై లబ్ధిదారుల వినతి
- సుమారు 150 మంది తునికాకు సేకరణదారులకు న్యాయం చేయాలి
తెలుగు గళం ఏటూరునాగారం, సెప్టెంబర్ 21:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరునాగారం–బి కల్లం గ్రామానికి చెందిన తునికాకు సేకరణదారులకు గతంలో రావాల్సిన బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని కోరుతూ సౌత్ రేంజ్ ఆఫీసర్‌కు లబ్ధిదారులు వినతిపత్రం సమర్పించారు. 2014 నుంచి 2021 వరకు తునికాకు సేకరణ చేసిన సుమారు 150 మంది లబ్ధిదారుల్లో చాలామందికి ఇప్పటికీ బోనస్ డబ్బులు అందలేదని వారు తెలిపారు. తునికాకు సేకరణకు సంబంధించిన బోనస్ డబ్బుల విషయంలో అవకతవకలు జరిగి, అర్హులైన ప్రజలకు నగదు అందకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను కలిసి విన్నవించినప్పటికీ, బోనస్ డబ్బులు వస్తాయని చెబుతూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా 2014 సంవత్సరానికి సంబంధించిన తునికాకు సేకరణ బకాయి డబ్బులను చెక్కు ద్వారా అందజేస్తామని గతంలో హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ద్వారా లబ్ధిదారుల పేర్లతో పాటు ఖాతాల వివరాలు, తీర్మానం సైతం అందజేశామని తెలిపారు. సంబంధిత రికార్డులను పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రావాల్సిన బోనస్ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని సౌత్ రేంజ్ ఆఫీసర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో కల్లెదర్ డి. సతీష్, కుమ్మరి సమ్మయ్య, కుమ్మరి రామక్క, కే. లలిత, కర్ణ ఇంద్ర, పూస నరసమ్మ, వావిలాల లక్ష్మి, వెలకంటి సులోచన తదితరులు పాల్గొన్నారు.
