
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ?
చిల్పూర్ మండలంలో 129 బెల్టు షాపులున్నాయనే ఆరోపణలు
17 గ్రామ పంచాయతీల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు?
32 వేల మంది ఓటర్లున్న మండలంలో పరిస్థితిపై అధికారుల నిఘా ఎక్కడ?
ఈ69 న్యూస్ జనగామ/చిల్పూర్, అక్టోబర్ 3
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 129 బెల్టు షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికారికంగా అనుమతులు లేని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? వాటికి మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి.మండలంలో ప్రభుత్వ వైన్స్ షాపులు 2 మాత్రమే ఉండగా, గ్రామాల్లో బెల్టు షాపుల సంఖ్య మాత్రం 129 వరకు ఉందని స్థానికుల నుంచి వచ్చిన వివరాలు చెబుతున్నాయి.సుమారు 32 వేల మంది ఓటర్లు ఉన్న మండలంలో ఇంత పెద్ద సంఖ్యలో బెల్టు షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.చిల్పూర్ మండలంలోని వంగాలపల్లిలో 4, నష్కల్‌లో 8, చిన్నపెండ్యాలలో 12, రాజవరంలో 18, తీగలతండలో 3, వెంకటేశ్వర్లపల్లిలో 3, వెంకటాద్రిపేటలో 6, మల్కాపూర్‌లో 10, కొండాపూర్‌లో 4, శ్రీపతిపల్లిలో 8, లింగంపల్లిలో 20, పత్తెపూర్లో 6, గార్లగడ్డతండలో 0, కృష్ణాజిగూడెంలో 7, పల్లగుట్టలో 5, దేశాయితండలో 3, చిల్పూర్‌లో 12 బెల్టు షాపులు ఉన్నట్లు స్థానికంగా సేకరించిన వివరాల్లో పేర్కొన్నారు.ఇందులో లింగంపల్లి, రాజవరం, చిన్నపెండ్యాల, చిల్పూర్, మల్కాపూర్ తదితర గ్రామాల్లో బెల్టు షాపుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది.చిన్నపెండ్యాల, వంగాలపల్లి గ్రామాల్లో వైన్స్ షాపులు కూడా ఉన్నాయి.బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లయితే వాటికి మద్యం సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయాలు జరుగుతున్నాయా? నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై ఎక్సైజ్ శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.అంతేకాకుండా గ్రామాల్లో బెల్టు షాపుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? అక్రమ మద్యం విక్రయాలపై ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? అనే వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.మద్యం విక్రయాలపై నిఘా పెట్టాల్సిన ఎక్సైజ్ శాఖకు బెల్టు షాపుల వ్యవహారం సవాల్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బెల్టు షాపుల పేరుతో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.