బెల్ట్‌ నిర్వాహకుల నుంచి వైన్స్‌ నిర్వాహకులు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు

అదనపు ధరకు బెల్ట్‌షాపుల్లో విక్రయం..ప్రభుత్వ సెలవు రోజుల్లో రెండింతల రేట్లు?

బెల్ట్ షాపులపై తెలుగు గళం దినపత్రిక వరుస కథనాలు-ఐనా కదలని నిఘా వ్యవస్థ

జనగామ, అక్టోబర్‌ 3 (ఈ69 న్యూస్)

జిల్లాలో బెల్ట్‌షాపుల వ్యవహారంపై తెలుగు గళం దినపత్రికలో వరుస కథనాలు వెలువడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా వైన్స్‌ దుకాణాల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా అవుతున్న తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సమగ్ర నిఘా కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి.వైన్స్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసే సమయంలో బెల్ట్‌షాపు నిర్వాహకుల నుంచి వైన్స్‌షాపుల నిర్వాహకులు ఒక్కో బీర్‌ లేదా మద్యం సీసాపై ఎమ్మార్పీకి అదనంగా సుమారు రూ.20 వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అదనపు మొత్తాన్ని చెల్లించి మద్యం తీసుకెళ్తున్న బెల్ట్‌షాపు నిర్వాహకులు, అనంతరం వినియోగదారుల నుంచి మరింత అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అంటే..వైన్స్‌షాపు నిర్వాహకులు బెల్ట్‌షాపు నిర్వాహకుల నుంచి అదనంగా రూ.20 తీసుకుంటే, బెల్ట్‌షాపు నిర్వాహకులు ఆ మొత్తానికే పరిమితం కాకుండా తమకు నచ్చిన రీతిలో మరింత అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో ఒక్క బీర్‌ రూ.220 వరకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రభుత్వ సెలవు రోజుల్లో మరింత బాదుడు?

వైన్స్‌షాపులకు ప్రభుత్వ సెలవు రోజుల్లో విక్రయాలు నిలిచే పరిస్థితిని బెల్ట్‌షాపు నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైన్స్‌షాపులు మూసివేసే ప్రభుత్వ సెలవు రోజుల్లో బెల్ట్‌షాపుల్లో మద్యం ధరలు ఏకంగా రెండింతలకు పెంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సాధారణ రోజుల్లోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు ఎదురవుతుండగా, ప్రభుత్వ సెలవు రోజుల్లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని మరింత భారీగా ధరలు పెంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

బెల్ట్‌షాపులపై గ్రామ పంచాయతీల పోరు

గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణకు వ్యతిరేకంగా పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీర్మానాలు చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. బెల్ట్‌షాపులు నిర్వహించవద్దని ప్రజాప్రతినిధులు కోరుతున్నప్పటికీ, నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో వివాదాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం.కొన్ని ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజాప్రతినిధులపై నిర్వాహకులు దాడులకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో గ్రామాల్లో బెల్ట్‌షాపుల వ్యవహారం కేవలం మద్యం విక్రయాలకే పరిమితం కాకుండా శాంతిభద్రతల సమస్యగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ నిఘా ఎక్కడ?

వైన్స్‌షాపుల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా అవుతోందా? అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారా? బెల్ట్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారా? ప్రభుత్వ సెలవు రోజుల్లో ధరలను రెండింతలకు పెంచుతున్నారా? అనే అంశాలపై స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా నిఘా వ్యవస్థ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే విషయాన్ని స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.బెల్ట్‌షాపులపై గ్రామ పంచాయతీలు పోరాడుతున్నాయి..ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు..పత్రికలు వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి..అయినా అధికారుల నిఘా మాత్రం ఎక్కడ? అన్నదే ప్రస్తుతం జనగామ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *