సర్వే నంబర్లు 54, 135లోని భూములపై తహసీల్దార్‌కు వినతిపత్రం

రెవెన్యూ రీ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి రక్షించాలి

జఫర్‌గఢ్ / ఈ69న్యూస్, అక్టోబర్ 12: జఫర్‌గఢ్

మండలంలోని షాపెల్లి గ్రామంలో ప్రభుత్వ భూములను గుర్తించి, భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ గ్రామస్థులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 54లో ఉన్న మూడు ఎకరాల గ్రామకంఠం భూమితో పాటు, సర్వే నంబర్ 135లోని రెండు ఎకరాల 24 గుంటల ఇనాం భూమిని రెవెన్యూ రీ సర్వే ద్వారా పరిశీలించి, ప్రభుత్వ భూములుగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ తాళ్లపల్లి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 135లోని రెండు ఎకరాల 24 గుంటల ఇనాం భూమిని సమగ్రంగా సర్వే చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించి ప్రత్యేక ప్రభుత్వ సర్వే నంబర్ కేటాయించాలని కోరారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియను అనుసరించి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా సర్వే నంబర్ 54లోని మూడు ఎకరాల పాత గ్రామకంఠం భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, ప్రభుత్వ భూమిగా గుర్తించాలని కోరారు. ఈ భూమిని గ్రామ అవసరాలతో పాటు ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను అభ్యర్థించారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ పార్టీ నియోజకవర్గ నాయకులు జువారి రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. తప్పుడు పత్రాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములకు పట్టాలు పొందినట్లు ఆరోపణలు ఉన్న సందర్భాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

భూ వివాదం పరిష్కారమయ్యే వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలి

సర్వే నంబర్లు 54, 135లోని భూములకు సంబంధించి రెవెన్యూ ఆర్డీవో కోర్టులో భూ వివాదం పెండింగ్‌లో ఉన్నందున, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని రీ సర్వే నిర్వహించాలని గ్రామస్థులు కోరారు. సంబంధిత భూములపై వివాదాల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల పరిశీలన పూర్తయ్యే వరకు నిబంధనలకు విరుద్ధంగా ఎవరి పేరుమీదా భూములను నమోదు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మాచర్ల సోమయ్య, శివరాత్రి కుమారస్వామి, కాసర్ల సోమనర్సయ్య, ఏడెల్లి కార్తీక్, కాసర్ల రమేష్, కుంట రాజ్ కుమార్, మాచర్ల రమేష్, చిదురాల కమలాకర్, కుంట సోమయ్య, లింగంపల్లి దామోదర్, తాళ్లపల్లి వెంకటయ్య, తాళ్లపల్లి స్వామి, లింగంపల్లి శంకర్, తాళ్లపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *