శ్రీశ్రీ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో భారీ అక్రమాలు వెలుగులోకి?
629.429 మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో తేడా.. ఆరుగురిపై కేసు నమోదు
తెలుగు గళం ఈ69 న్యూస్ | మహబూబాబాద్ జిల్లా

ప్రభుత్వ ధాన్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రైస్ మిల్లులే అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయా? పేదల సంక్షేమం, ప్రజాధనంతో ముడిపడిన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతోందా? మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలోని శ్రీశ్రీ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై సివిల్ సప్లై, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన భారీ నిల్వల వ్యత్యాసం ఇప్పుడు కలకలం రేపుతోంది.మిల్లులో తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) రూపంలో తిరిగి అప్పగించాల్సిన ధాన్యంలో 629.429 మెట్రిక్ టన్నుల మేర కొరత ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం ఇంత భారీ స్థాయిలో తక్కువగా ఉండటంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.పున్నం కామేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సివిల్ సప్లై కార్పొరేషన్ టెక్నికల్ అసిస్టెంట్, వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సంబంధిత ఆరుగురిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదైన ఆరుగురు వ్యక్తులు:
- తల్లాడ చంద్రమోహన్
- భువనగిరి సురేష్
- ఉప్పుల వెంకటేశ్వర్లు
- ఉప్పుల కృష్ణమూర్తి
- ఉప్పుల నాగేశ్వరరావు
- గుడిపాటి శిరీష
అధికారుల తనిఖీలతోనైనా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?
ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎలా వచ్చింది? ధాన్యం ఎక్కడికి వెళ్లింది? దీనికి బాధ్యులెవరు? మిల్లులో రికార్డులు, వాస్తవ నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను సమగ్ర విచారణ ద్వారా బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజాధనం దుర్వినియోగమైతే బాధ్యులెవరైనా ఉపేక్షించకూడదు!