28 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో 1997-98 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహభరితంగా,కోలాహలంగా జరిగింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత తోటి సహపాఠులు ఒకే వేదికపై కలుసుకోవడంతో అక్కడ ఆనంద వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు శ్రీ వేముల వేణుగోపాల్ గారితో పాటు ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణ ప్రసాద్, కుమారస్వామి, మురళి, జానీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పూర్వ విద్యార్థులు తమ గురువులకు పాదాభివందనం చేసి, శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదవడం ద్వారా విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ శిష్యులు సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో నిలవడం గురువులకు గర్వకారణమని అన్నారు.పూర్వ విద్యార్థులు ఇండ్ల శశిధర్, గన్ రెడ్డి లోకేష్, ముడుపు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగ క్షణాలు కనిపించాయి.చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలు ఈ సమ్మేళనానికి మరింత ఆనందాన్ని తెచ్చాయి. ఒకరి టిఫిన్ బాక్స్‌ను మరొకరు లాక్కోవడం, బడి ఎగ్గొట్టి ఆడిన ఆటలు, అప్పటి అల్లరి పనులు గుర్తుచేసుకుంటూ నవ్వులు పూశాయి. వయస్సు పెరిగినా, బాధ్యతలు పెరిగినా ఆ క్షణాల్లో అందరూ మళ్లీ పాఠశాల రోజుల్లోకి వెళ్లినట్టయ్యారు.ఈ కలయికలో ముఖ్యంగా గురువుల బోధనపై పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా చర్చించారు. తమ జీవితానికి పునాది వేసింది గురువులే అని, వారు నేర్పిన విలువలు, క్రమశిక్షణ, జీవన పాఠాలు తమ విజయాలకు మూలకారణమని పేర్కొన్నారు. “పాఠశాలలో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయి” అంటూ ఉపాధ్యాయులను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో 1997-98 బ్యాచ్‌కు చెందిన అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.ఈ ఆత్మీయ కలయిక అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది