గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ వేగవంతం చేయాలి
జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే మరియు సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు.రహదారి నిర్మాణంతో వాణిజ్య రవాణా వేగవంతమవడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని,ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని వివరించారు.భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా చట్టబద్ధమైన విధానంలో భూ యజమానులకు సరైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు.భూ యజమానులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేయాలని, ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందడం ద్వారా మాత్రమే ప్రాజెక్టు సాఫీగా అమలవుతుందని ఆయన తెలిపారు.రెవెన్యూ శాఖ, నేషనల్ హైవే అధికారులు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోపు భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రాజెక్టు అమలులో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, అధికారులు ప్రజలతో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,ఆర్డిఓ హరికృష్ణ,గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్టు అధికారులు,ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లా అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు వెల్లడించారు.