ప్రాధాన్యతా రంగాలకు రూ. 2971.20 కోట్ల రుణాల లక్ష్యం
సమన్వయంతో లక్ష్య సాధనకు కృషి చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ
ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందజేయాలి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న
భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగాలకు మొత్తం రూ. 2971.20 కోట్ల రుణాలు మంజూరు చేయడం లక్ష్యంగా నిర్ణయించగా, డిసెంబర్ మాసం నాటికి రూ. 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.గురువారం ఐడీఓసి కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) మరియు జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. జిల్లాలో రుణాల మంజూరు, అమలు పురోగతి, రికవరీ పరిస్థితులు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష జరిగింది.సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాధాన్యతా రంగాల రుణాల మంజూరులో లక్ష్యాలకు అనుగుణంగా పురోగతి సాధించేలా బ్యాంకర్లు చురుకుగా పనిచేయాలని సూచించారు.ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న యూనిట్లను వేగంగా పరిష్కరించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు.రుణాల మంజూరుతో పాటు రికవరీ శాతాన్ని పెంచేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సూచించారు.మున్సిపల్,గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వం అందిస్తున్న నిధుల వినియోగంలో నిర్లక్ష్యం సహించబోమని, లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలో పంట రుణాలు, ఎంఎస్ఎంఈ, గృహ నిర్మాణ, విద్య మరియు వ్యవసాయ రుణాల అమలు తీరును సమావేశంలో విపులంగా సమీక్షించారు.గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం మరియు సెరికల్చర్ రంగాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకర్లు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందించడం అత్యంత కీలకమని అన్నారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు రీన్యువల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకర్లు రైతులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సహకార భావంతో వ్యవహరించాలని సూచించారు.రుణాలు చెల్లించని వారికి అవగాహన కల్పించి వసూళ్లు పెంచాలని, కానీ రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతంలో డైరీ యూనిట్ల స్థాపనకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా రుణ సదుపాయం కల్పించాలని కోరారు.సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య,ఆర్బిఐ ఎల్డీఓ యశ్వంత్ సాయి,నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, యూబీఐ డీజీఎం, టీజీబీ ఆర్ఎం, ఎల్డీఎం ఎ. తిరుపతి, జిల్లా అధికారులు మరియు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.జిల్లాలో వ్యవసాయం, స్వయం ఉపాధి,పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధికి రుణాల విస్తరణ కీలకమని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.లక్ష్య సాధనలో బ్యాంకర్లు మరియు అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.