నర్సింగ్ అధికారుల సమస్యలపై అవగాహన సదస్సు
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణ తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నర్సింగ్ అధికారుల సమస్యలపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని గౌట్ జనరల్ హాస్పిటల్ (జి జి హెచ్) 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 150 మంది నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు జన్ను కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా నర్సింగ్ అధికారుల నైట్ డ్యూటీ భద్రత, డ్యూటీ టైమింగ్‌ల సక్రమీకరణ, కార్యాలయ భద్రత,ప్రమోషన్లలో పారదర్శకత,ఆసుపత్రి ఆవరణలో ఎదురయ్యే సేవా సంబంధిత సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. ఉద్యోగ భద్రతతో పాటు సమానత్వం, సేవలో నైతిక విలువలు పాటించడం,సీనియర్లకు గౌరవం ఇవ్వడం వంటి అంశాల ప్రాధాన్యాన్ని వక్తలు వివరించారు.జిల్లా పరిధిలోని రెండు సీహెచ్‌సీలు (చిట్యాల, కాటారం), 17 పీహెచ్‌సీలు, ఒక జి జి హెచ్100 పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి, పరిష్కార మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.మహిళా సిబ్బందికి సురక్షిత వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఓఏ రాష్ట్ర అధ్యక్షుడు పి. రవి కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. శివసాయి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్. విద్యాసాగర్ మార్గనిర్దేశక సందేశాలు అందించారు. జిల్లా స్థాయిలో గౌరవ అధ్యక్షురాలిగా బి.ఈ. రాణి, అధ్యక్షుడు జన్ను కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రణధీర్, ప్రధాన కార్యదర్శి బి. రాజు, ఉపాధ్యక్షులు బి. మణి, జె. గణేష్, పి. స్వర్ణలత, జి. ప్రమీల, ఈ. సురేష్, నైతిక సలహాదారులు పి. నీరాజరాణి, డి. వినాయకుమారి, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీని భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు, అలాగే రాష్ట్ర కమిటీ భూపాలపల్లి జిల్లా కమిటీ మెంబర్స్‌ని ఘనంగా సత్కరించి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు జన్ను కుమార్ ను కోరారు.సదస్సు అనంతరం నర్సింగ్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చలు జరిపి తదుపరి కార్యాచరణ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు