స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
రేగొండ మండలంలో స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటారు.మండల కేంద్రంలోని వాణీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన పోడేటి శివ కుటుంబాన్ని ఆయన తోటి పూర్వ విద్యార్థులు పరామర్శించి అండగా నిలిచారు.రేగొండ గ్రామానికి చెందిన శివ తండ్రి మొగిలి ఇటీవల అనారోగ్యంతో మరణించగా,విషయం తెలుసుకున్న పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం అతని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.కుటుంబానికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయంగా రూ.16,000 నగదును అందజేశారు.భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, కష్టకాలంలో పరస్పరం తోడ్పాటు అందించడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధం జీవితాంతం నిలవాలని, అవసర సమయంలో సహకారం అందించడం ద్వారా సమాజంలో మానవీయ విలువలు బలపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు