లోఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి 160 కేవిఎ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
స్టేషన్ ఘనపూర్ ఆదివారం పట్టణ కేంద్రంలోని 132 కేవి విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్-33/160 కేవిఎ విద్యుత్ నియంత్రికను ఘనపూర్ ఆపరేషన్ ఏఈ పగిడిముంతల శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో సమతూల్యతను సాధించి లోఓల్టేజ్ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఘనపూర్ మెయిన్ రోడ్ కుడివైపున సబ్ స్టేషన్ వెనుక బస్తీ నుండి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తరచుగా ఎదురవుతున్న లోఓల్టేజ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, బస్టాండ్ సమీపంలో ఉన్న 160 కేవిఎ విద్యుత్ నియంత్రికకు అనుసంధానంగా సబ్ స్టేషన్ సమీపంలోని లోడ్ సెంటర్ వద్ద 160 కేవిఎ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీని ద్వారా స్థానికంగా విద్యుత్ ఒత్తిడి సమతుల్యం అవడంతో వినియోగదారులకు మెరుగైన సరఫరా అందుతుందని తెలిపారు.ఇప్పటికే పట్టణ పరిధిలో అదనపు విద్యుత్ నియంత్రికలను ఏర్పాటు చేసి వేసవి కాలంలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉన్నామని, మిగిలిన పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని చెప్పారు.వినియోగదారులు సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని సూచించారు. అలాగే నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే కాకుండా వినియోగదారులు విద్యుత్ బకాయిలు లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో లైన్మెన్ వాసం శ్రీధర్, ఏఎల్ఎం ఊరడి నాగరాజు, గుత్తేదార్ కామిడి అమరేందర్ రెడ్డి, అన్మ్యాండ్ నామోజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.