ఉద్యాన పంటలపై అవగాహన సదస్సు
కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో శుక్రవారం ఉద్యాన పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గంగారం గ్రామంలో ఎక్కువ కుటుంబాలు కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. కూరగాయల సాగు తక్కువ కాలంలోనే రైతులకు ఆదాయం అందించే ముఖ్యమైన పంటగా నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని చెప్పారు.సీజన్‌కు అనుగుణంగా సరైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి సమర్థ నిర్వహణ, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా ఇంటి వద్ద చిన్న స్థాయిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం లభించడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.కూరగాయల పంటల్లో వచ్చే చీడపీడలు, వ్యాధులను ముందుగానే గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ పద్ధతులను పాటిస్తే ఖర్చు తగ్గి మంచి దిగుబడులు సాధ్యమవుతాయని రైతులకు తెలియజేశారు.ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాలు, కూరగాయల సాగుకు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, మినీ కిట్ల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా కూరగాయల పందిరి నిర్మాణం చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఉచిత కూరగాయల మినీ కిట్లను గ్రామ సర్పంచ్‌తో కలిసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్,వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యాన విస్తరణాధికారి రాందాస్, రైతులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.