మురళీధర్ రావుకు ఘన వీడ్కోలు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఆర్.మురళీధర్ రావుకు మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మురళీధర్ రావు తన పూర్తి సేవా కాలంలో కర్తవ్యపరుడు, బాధ్యతాయుత అధికారి, నిజాయితీ గల వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు.ఆయన కార్యనిర్వహణలో చూపిన నిబద్ధత, సమయపాలన,క్రమశిక్షణ ఇతర ఉద్యోగులకు ఆదర్శప్రాయంగా నిలిచాయని అన్నారు.రెవెన్యూ శాఖలో సుమారు మూడు దశాబ్దాల పాటు పనిచేసి ప్రజలకు విశేష సేవలు అందించారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ చురుకుదనంతో,పారదర్శకతతో వ్యవహరించారని పేర్కొన్నారు.మురళీధర్ రావు కార్యాలయ పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించారని, ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని పెంపొందించి సమర్థవంతమైన పరిపాలన అందించడంలో కృషి చేశారని కలెక్టర్ అన్నారు. ప్రజల పట్ల అనురాగం, సేవా భావం కలిగిన అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని, ఇలాంటి అంకితభావంతో పనిచేసే అధికారుల వల్లే పరిపాలన వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.వీడ్కోలు సభలో పలువురు అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ, మురళీధర్ రావుతో కలిసి పనిచేసిన అనుభవాలను స్మరించుకున్నారు. ఆయన సహనంతో, సహకార భావంతో, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను కొనియాడారు.ఉద్యోగ జీవితంలో ఆయన సాధించిన విజయాలు యువతరానికి ఆదర్శమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మురళీధర్ రావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, స్మృతిచిహ్నం అందజేశారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి షఫీ సర్కార్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకరయ్యతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని మురళీధర్ రావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.