అమెరికా సామ్రాజ్యవాదానికి ఘోరమైన ఓటమి
బలవంతుడిపై బలహీనుడు చేసిన యుద్ధంలో
ట్రంప్ దురహంకారానికి సరైన గుణపాఠం జరిగింది
అంతర్జాతీయ రాజకీయాలలో ప్రాముఖ్యతను కోల్పోయిన భారత్
సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
సామ్రాజ్యవాద అహంకారంతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చాలాయించడానికి, ప్రపంచ వనరులను దోపిడీ చేయడానికి అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై దాడులు చేశాయని, సామ్రాజ్యవాదరంకారంలో ఇరాన్ నాగరికతను ఒక్క రాత్రిలో సర్వనాశనం చేస్తామని, రాతి యుగానికి మళ్లీ ఇరాన్‌ను తీసుకువెళతానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారానికి తగిన గుణపాఠం చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ చెప్పిందని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఖమ్మం బోడేపూడి భవనంలో సిపిఐ(ఎం) జిల్లా స్థాయి ప్లీనం మాచర్ల భారతి అధ్యక్షతన జరిగింది. ఈ ప్లినంకు ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇరాన్ పాలకవర్గం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంపుకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకూ కక్ష ఉన్నా, తమకు అనుకూలంగా ఇరాన్ పాలన చేయకపోయినా, అక్కడి మత ప్రేరిత పాలనా పద్ధతులు నచ్చకపోయినా, ఇరాన్ ప్రభుత్వాన్ని ఉంచాలా, దించాలా అన్నది అక్కడి పాలన ఫలితాలను అనుభవించే ప్రజలే నిర్ణయించుకోవాలని, ఆ హక్కుని హరించే అధికారం మరో దేశానికి ఉండకూడదని అన్నారు. ఇరాన్ పాలకవర్గం తమకు పాదాక్రాంతం కాకపోతే ఆ దేశ నాగరికతనే నాశనం చేస్తామంటూ ఆనాటి హిట్లర్ లాగా ట్రంపు హెచ్చరికతో ప్రపంచ దెశాలతో పాటు అమేరికా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని తెలిపారు. చైనా సాంకేతిక సహకారంతో బలవంతుడిపై బలహీనుడు చేసిన యుద్ధంలో ప్రపంచ పోలీస్, అత్యంత
ఆర్థిక శక్తి కలిగిన అమెరికాను ఎదిరించి ఇరాన్ నిలిచిందని అన్నారు. వియత్నాం యుద్ధం అనుభవాలను ట్రంపు తెలుసుకోవాలని, కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఉత్తర వియత్నాంలో 9 లక్షల మంది సైనికులు చనిపోతే అమెరికా మద్దతుతో పాలన సాగిన దక్షిణ వియత్నాంలో 1,85,000 మంది మరణించారు. వియత్నాం పౌరులు 20 లక్షల దాకా చనిపోయారు. యుద్ధానికి మద్దతుగా దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సైన్యాలను అమెరికా రంగంలోకి దించిందని గుర్తు చేశారు. 20 ఏళ్లపాటు వియత్నాంలో అమెరికా యుద్ధం చేసిందని, చివరికి ఏమీ చేయలేక 1973లో సైన్యాలను వెనక్కి రప్పించుకోవాల్సి వచ్చిందని, తమ ప్రభుత్వం సాగిస్తున్నది ధర్మయుద్ధం కాదని అమెరికా విద్యార్థులూ యువకులూ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారని తెలిపారు. రాజకీయ సంకల్ప బలం, జాతీయవాదం కలగచేసే ప్రేరణ, ప్రాణాలొడ్డే త్యాగనిరతి ఉన్న ప్రజల ముందు ఆయుధబలం అంతిమంగా ఓడిపోతుందని నాడు వియత్నాం చరిత్ర, నేను ఇరాన్ యుద్ధం నిరూపించిందని అన్నారు. ఇరాన్ అనూహ్య సమరశీలతను ప్రదర్శించిందని. అమెరికా, ఇజ్రాయెల్‌ల ఏకపక్ష యుద్ధానికి నాటో దేశాలు సైతం సహాయనిరాకరణ చేయటం ఇరాన్‌కు నైతిక విజయం అన్నారు. చైనా, రష్యా అండతో అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదంపై ఇరాన్ విజయం సాధిస్తే, అంతర్జాతీయ రాజకీయాలలో భారత్ తాన ప్రాముఖ్యతను కొల్పోయిందని విమర్శించారు. అమెరికా చెప్పింది చేసే దుర్మార్గపు అలవాటు ఉన్న మోడీ పాలనలో భారత దేశం తన స్థాయి దిగజారిందని, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నడిపిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు,బండి రమేష్, వై విక్రమ్, బుగ్గవీటి సరళ,
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాల్ రావు
జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.