ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై కలెక్టర్,ఎస్పీ సమగ్ర పరిశీలన
భూపాలపల్లి జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ సంయుక్తంగా పరిశీలించారు.సభ విజయవంతం కోసం చేపడుతున్న ఏర్పాట్లపై వారు అధికారులు నుంచి సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా సభా స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు.పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి పార్కింగ్ విస్తరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. హెలిప్యాడ్ పరిశీలన సందర్భంగా దుమ్ము ఎగరకుండా తరచుగా నీరు చల్లడం, స్థలాన్ని సమంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.సభా ప్రాంగణంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్ & బి ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.