ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించాలి
- ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి*
- ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించి,కార్మికులపై పనిభారాలు పెంచి,ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నారని వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్ల ను పరిష్కరించాలని,ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ఖమ్మం మంచికంటి భవనంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు,కేంద్ర,రాష్ట్ర కార్మిక,ప్రజాసంఘాల నాయకులతో గుండు మాధవరావు అధ్యక్షతన ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ప్రధాన వక్తగా పాల్గొన్న గడ్డం లింగమూర్తి మాట్లాడుతూ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని ఆర్టీసీ కార్మికులంతా విశాల ఐక్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం లేబర్ కోడ్ ల అమలు విషయంలో స్పష్టతనీయడం లేదని,2017 వేతన ఎరియర్స్ చెల్లింపుల్లోనూ,2021 మరియు 2025 వేతన సవరణల విషయంలోనూ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉందని ఆక్షేపించారు.సమ్మె డిమాండ్లను పరిష్కరించి,ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీ రక్షణ,కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అండగా సిఐటియు ఎల్లవేళలా ఉంటుందన్నారు.ప్రజల్లో భాగమైన ఆర్టీసీ కార్మికులకు అండగా ఉద్యోగులు,వ్యాపారులు,విద్యార్థులు,ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతునీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం రీజియన్ గౌరవాధ్యక్షులు బీవీ రెడ్డి మాట్లాడుతూ అనేక రకాల విజ్ఞప్తులు,వినతి పత్రాలు ఇచ్చిన తర్వాతనే సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా నే సమ్మె లోకి నెట్టి వేయబడ్డామన్నారు.వామపక్ష కార్మిక సంఘమైన సిఐటియు సమ్మెలో ప్రత్యక్ష పోరాటం లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో గుండు మాధవరావు సమావేశపు నోటు ప్రవేశపెడితూ ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలు జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని,సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలు విడనాడాలని,విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగానికి వస్తున్న ప్రమాదాన్ని నివారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు.ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు,టియుసిఐ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య లు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావ సందేశం ప్రకటించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్. నవీన్ రెడ్డి భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మెరుగు వెంకటరమణ,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం డిపో కార్యదర్శి బేతంపూడి బుచ్చిబాబు,స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కోశాధికారి పగిళ్ళపల్లి నరసింహారావు,ఖమ్మం డిపో కార్యదర్శి గుగ్గిళ్ళ రోశయ్య డిపో కమిటీ నాయకులు బుగ్గవీటి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.