

ఈ69న్యూస్ న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 25
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం సూరారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-2లో చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే మరియు అన్నప్రాశన కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎం. ప్రభాకర్, ఉప సర్పంచ్ కె. పద్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ టీ. అనిత ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.అంగన్వాడి టీచర్ పర్వీన్ సుల్తానా, ఆయా టీ. ఉపేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చిన్నారులు రంగురంగుల దుస్తుల్లో హాజరై సందడి చేశారు.ప్రీ-స్కూల్ విద్యను పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా చిన్నారులకు అసెస్మెంట్ కార్డులను పంపిణీ చేసి, వారి అభివృద్ధి, నేర్చుకున్న నైపుణ్యాలపై తల్లిదండ్రులకు వివరించారు. అలాగే అన్నప్రాశన కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు మొదటి సారిగా ఘనాహారం అందించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఆశీస్సులు అందించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ టీ. అనిత మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చిన్నారుల మొదటి ఐదేళ్లు ఎంతో కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం, ప్రాథమిక విద్య ఎంతో అవసరమని వివరించారు.గ్రామ సర్పంచ్ ఎం. ప్రభాకర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఉప సర్పంచ్ కె. పద్మ కూడా తల్లిదండ్రులు పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.