
ఈ69 న్యూస్ – భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, మెగా జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బృహత్ ఉద్యోగ మేళాలో వివిధ కంపెనీలకు ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నుంచి 43 మంది యువతీ యువకులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
యువత ప్రభుత్వం నిర్వహించే ఉపాధి మేళాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆయన జ్ఞాపికలు (మెమొంటోలు) అందజేసి అభినందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య దినోత్సవ (క్లీన్ డే) కార్యక్రమంలో భాగంగా చారిత్రక కోటగుళ్ల పరిసరాలను స్వచ్ఛందంగా పరిశుభ్రం చేసిన క్రీడాకారులు, పురావస్తు శాఖ సంచాలకులు బుజ్జి, రక్షణ అధికారి రాజు, సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రవీందర్ తదితరులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, శివసాగర్, ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.